mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 12:11 pm Digital Edition : Namastey Mahaaprabha

సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సంజు దూకుడుగా ఆడతాడని వెల్లడించాడు.

స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 2 (మహాప్రభ) : ఐపీఎల్(IPL)2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీ20 వరల్డ్ కప్ 2026 హీరో సంజు శాంసన్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ వస్తుందని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌‌లో సంజు విఫలమై నిరాశపరిచాడు. ఇవాళ జరిగే మ్యాచ్‌లో రాణిస్తాడని సీఎస్కే అభిమానులు ఆశిస్తున్నారు.

క్రిష్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ..’చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్, చెన్నై మ్యాచ్‌ జరగనుంది. టీ20 ప్రపంచ కప్‌లో సంజు శాంసన్ పునరాగమనం చేసి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నది ఇదే వేదిక. అందుకే అతను కచ్చితంగా ఈసారి ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడబోతున్నాడు. అతను తిరిగి అద్భుతమైన ఫామ్‌లోకి రావడానికి ఇది సరైన వేదిక. తొలి నాలుగైదు బంతులు చూసిన తర్వాత సంజు చెలరేగిపోవాలి. అతను పీబీకేఎస్‌పై సూపర్ ఇన్నింగ్స్ ఆడతాడని నేను నమ్ముతున్నాను’ అని తెలిపాడు.’సంజు క్లిక్‌ అయితే మాత్రం చెన్నైను ఆపడం చాలా కష్టం. ఈ మైదానంలో చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు 220 పైచిలుకు స్కోరు నమోదు చేస్తే.. విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటు పంజాబ్‌ కూడా పటిష్ఠమైన జట్టే. శ్రేయస్‌ అయ్యర్ నాయత్వంలోని పంజాబ్ జట్టు బలంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ ట్రాక్‌పై సీఎస్కే కూడా బాగా ఆడగలదు. సంజు దూకుడుగా ఆడితే.. పంజాబ్‌కు ఎలాంటి అవకాశం ఉండదు. సంజుకు దీటుగా నిలబడే బ్యాట్స్‌మెన్ పీబీకేఎస్‌లో ఎవరూ లేరు’ అని క్రిష్‌ విశ్లేషించాడు.