మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం విచారణ జరగుతోంది.

ఢిల్లీ, ఫిబ్రవరి5 మహాప్రభ : రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy case) దర్యాప్తులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం విచారణకు రాగా.. దర్యాప్తు పూర్తైందని సీబీఐ బృందం.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని సాంకేతిక అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ అధికారులు ధర్మాసనానికి వివరించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం.. దర్యాప్తు సంస్థకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఒకవేళ ఈ కేసులో ఇంకా ఎవరినైనా కొత్తగా విచారించాల్సిన అవసరముంటే.. కచ్చితంగా ముందస్తు అనుమతి పొందాలని ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది.
సునీతారెడ్డి విన్నపం..
ఈ కేసు విచారణ సమయంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది ఒక విన్నపం చేశారు. సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా ఈ కేసులో వాదనలు వినిపిస్తారని, ఆయన వచ్చేంత వరకూ విచారణను కాసేపు ఆపాలని కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను మరికాసేపటికి వాయిదా వేసింది. కాసేపట్లో ప్రారంభం కాబోయే విచారణలో లూథ్రా దర్యాప్తులో ఉన్న లోపాలు లేదా తదుపరి విచారణ అవశ్యకతపై పాయింట్లు లేవనెత్తే అవకాశం ఉంది.