mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:51 am Digital Edition : Namastey Mahaaprabha

విరాట్, రోహిత్‌లను వెనక్కి నెట్టిన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెట్‌ స్టార్‌ స్మృతి మంధాన టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.

స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 18 (మహాప్రభ) : దక్షిణాఫ్రికా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్‌ సేనపై గెలిచింది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెట్‌ స్టార్‌ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున పురుషులు, మహిళలు జట్లు కలిపి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది.

ఈ క్రమంలో దిగ్గజాలైన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలను స్మృతి మంధాన వెనక్కి నెట్టింది. విరాట్‌ 125 ఇన్నింగ్స్‌లో 4,188 పరుగులు.. రోహిత్‌ తన 159 ఇన్నింగ్స్‌లో, 4231 పరుగులు చేశారు. అయితే మంధాన 161 ఇన్నింగ్స్‌లో 4,244 పరుగులు చేసింది. మహిళల విభాగంలో మంధాన తర్వాతి స్థానాల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (191 మ్యాచ్‌ల్లో 3,854 పరుగులు) ఉంది. మూడు , నాలుగు స్థానాల్లో స్టార్ జెమీమా రోడ్రిగ్స్‌ (119 మ్యాచ్‌ల్లో 2,587 పరుగులు), షఫాలీ వర్మ (99 మ్యాచ్‌ల్లో 2,553 పరుగులు) ఉన్నారు.

ఓవరాల్‌గా మహిళల విభాగంలో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ సూజీ బేట్స్‌ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. ఆమె 181 ఇన్నింగ్స్ లో 4,717 పరుగులు చేసింది. మంధాన రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక పురుషుల విభాగానికి వస్తే.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 145 మ్యాచుల్లో 4,596 పరుగులు చేశాడు.