ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఏపీ జెన్కో ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు.
అమరావతి, మార్చి 13 మహాప్రభ : ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభినందించారు. ఏపీ జెన్కో ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టారు. ఈ నెల 11వ తేదీన, 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ రికార్డు ఒక్కరోజే సాధించడం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్‌కో ప్లాంట్ల కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి, మొత్తం జెన్‌కో టీమ్‌కు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జెన్‌కో సాధించే విజయాలు రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఒకే రోజు 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించటం జెన్‌కోకి చరిత్రాత్మక ఘనత అని వెల్లడించారు. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.