mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 5:19 am Digital Edition : Namastey Mahaaprabha

వికారాబాద్‌లో దారుణం… మహిళ హత్య

వికారాబాద్‌లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వికారాబాద్ జిల్లా ఏప్రిల్ 1 (మహాప్రభ) : పరిగి మండలం రంగంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పద్మమ్మ(62) అనే మహిళ తన ఇంట్లో హత్యకు గురైంది. పద్మమ్మ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానిక మహిళలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా పద్మమ్మ హత్యకు గురైనట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి.

దుండగులు ఇంట్లోని బీరువా వద్ద ధనియాల పొడి చల్లి.. ఆనవాళ్లు తుడిచివేసే ప్రయత్నం చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఇదే అదునుగా చోరీ చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు పద్మమ్మ ఓ మాజీ ఏఎస్‌ఐ భార్య. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పద్మమ్మ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.