mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 12:23 pm Digital Edition : Namastey Mahaaprabha

వారి చొరవతోనే అమరావతి అజరామరం: రాజధాని రైతులు

ఏపీ హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్వంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతిని కాపాడిన ప్రాణదాతగా నాటి మండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్‌కు పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు రాజధాని రైతులు.

అమరావతి ఏప్రిల్ 7 (మహాప్రభ) : రాజధానిగా అమరావతి చట్టబద్ధత, గెజిట్ విడుదలపై ఏపీ హైకోర్టు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్వంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజధాని రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. న్యాయమూర్తుల బంగ్లాల నుంచి హైకోర్టు వరకు ర్యాలీగా వెళ్లారు. ఆపై న్యాయస్థానం వద్ద జాతీయ పతాకానికి న్యాయవాదులు, రైతులు నమస్కారం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజధాని అమరావతిని కాపాడిన ప్రాణదాతగా నాటి మండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్‌కు పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు రాజధాని రైతులు.

న్యాయస్థానం, శాసనమండలి చొరవతో అమరావతి అజరామరమైందని రైతులు తెలిపారు. హైకోర్టు ముందున్న త్రివర్ణపతాకం ఎదుట నిలబడి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. అమరావతిని కాపాడినందుకు హైకోర్టుకు రైతులు హారతి పట్టి, సాష్టాంగ నమస్కారం చేశారు. హైకోర్టు వద్ద సంబరాల్లో శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్య రావు, రెరా చైర్మన్ శివారెడ్డి, గ్రంధాలయ కార్పొరేషన్ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.