mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 11:49 am Digital Edition : Namastey Mahaaprabha

వారంలో పెళ్లి.. ఇంతలో మృత్యువు..

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం రెవెన్యూ పరిధిలో ఇటుకలగడ్డ తండాలో బుధవారం ఓ యువతి బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది.

  • బావిలో పడి యువతి అనుమానాస్పద మృతి 
  • మరణంపై బంధువుల సందేహాలు.. ఆందోళన

మహబూబాబాద్‌ ఏప్రిల్ 23 (మహాప్రభ) : మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం రెవెన్యూ పరిధిలో ఇటుకలగడ్డ తండాలో బుధవారం ఓ యువతి బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది. బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గిరిపురం ఇటుకలగడ్డ తండాకు చెందిన భూక్యా వెంకన్న-వినోద దంపతులకు శైలు, సంగీత (20) కూతుర్లు. కాగా, మరిపెడ మునిసిపల్‌ కేంద్రం కొత్తతండాకు చెందిన అజ్మీరా గోవింద్‌ కుమారుడు అరవింద్‌, సంగీతలు ప్రేమించుకున్నారు. అరవింద్‌ వ్యవసాయం చేస్తుండగా, సంగీత కూలి పనులు చేస్తోంది. మొదట వారిద్దరి పెళ్లికి సంగీత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

ఈ విషయంపై సంగీత గతంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో చేసేదేమీ లేక పెద్దలు వారి పెళ్లికి అంగీకరించి ఈ నెల 29న ముహూర్తం ఖరారు చేశారు. కాగా, మంగళవారం సాయంత్రం అరవింద్‌ ఇంట్లో ఓ శుభకార్యానికి సంగీత తల్లిదండ్రులు వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అలాగే ఇటుకాలగడ్డ తండాలోనే ఉన్న సంగీత వద్దకు అరవింద్‌ వెళ్లి ఆమెను బయటకు తీసుకుని వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అనంతరం సంగీత బుధవారం ఇటుకలగడ్డ తండా సమీపంలో ఓ వ్యవసాయ బావిలో శవమై తేలినట్లు స్థానికులు తెలిపారు. అయితే బావి సమీపంలో రక్తం మరకలతో కూడిన చెప్పులు ఉండడంతో యువతి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ జరుపుతున్నారు.

కారకులను శిక్షించాలి..

సంగీత మృతికి గల కారకులను తమకు అప్పగించాలని మరిపెడ పోలీస్ స్టేషన్‌ వద్ద బుధవారం బంధువులు ఆందోళనకు దిగారు. సంగీత మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకొని సంగీత మృతికి కారకులను వెంటనే శిక్షించాలని, లేదా తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని సీఐ పవన్‌, ఎస్సై వీరభద్రరావు బాధిత కుటుంబానికి నచ్చజెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు.