mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 12:01 pm Digital Edition : Namastey Mahaaprabha

వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన వేళ.. డొమెస్టిక్ గ్యాస్‌ ధరపై కేంద్రం క్లారిటీ

వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది.

న్యూఢిల్లీ ఏప్రిల్ 1 (మహాప్రభ) : వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది. ఆ కొద్ది రోజుల తేడాతోనే వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. దీంతో గృహ వినియోగానికి వినియోగించే‌ గ్యాస్ సిలిండర్ ధర సైతం మళ్లీ పెరుగుతుందంటూ ప్రజల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది.
ఎందుకంటే.. వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెంచిన సమయంలోనే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.60 చమురు సంస్థలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ వేళ.. మళ్లీ గ్యాస్ బండ బాదుడు తప్పదని సామాన్య మానవుడు ఆందోళన చెందుతున్నాడు.
అలాంటి వేళ.. పెట్రో ధరలపై కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువు మంత్రిత్వశాఖ బుధవారం క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేది లేదని స్పష్టం చేసింది. గ‌ృహావసరాలకు సంబంధించిన డొమిస్టిక్ గ్యాస్ ధరలూ సైతం పెంచమని పేర్కొంది. మరో రెండు నెలలకు సరిపడా దేశంలో పెట్రో నిల్వలు ఉన్నాయని సదరు మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే పరిశ్రమలు, హోటళ్లు వినియోగించే వాణిజ్య సిలిండర్ల ధరలపై నియంత్రణ లేదని పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటిపై నిర్ణయం ఉంటుందని వివరించింది. నెలవారీగా వీటి ధరలను సవరిస్తారని తెలిపింది. దేశంలో వినియోగించే మొత్తం ఎల్‌పీజీలో వీటి వినియోగం 10 శాతం కంటే స్వల్పంగానే ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంతో హోర్ముజ్ జలసంధి మార్గంలో రాకపోకలు నిలిచిపోవడం వల్ల ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ ధర పెంచక తప్పని పరిస్థితి నెలకొందని పేర్కొంది.
గృహా వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 965 వసూల్ చేస్తున్నట్లు చెప్పింది. భారత్ పొరుగు దేశాలు.. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌తో పోలిస్తే మన దేశంలోనే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం సహాజ వాయువు మంత్రిత్వ శాఖ సోదాహరణగా వివరించింది పెట్రల్, డీజిల్ ధరలు సైతం యథాతథంగా ఉన్నాయని వివరించింది.