mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 6:25 am Digital Edition : Namastey Mahaaprabha

వరంగల్‌లో అల్లరిమూకల అరాచకం.. పాదచారుడిపై బండరాయితో కిరాతక దాడి

వరంగల్‌ నగరంలో అల్లరిమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా లేబర్ కాలనీ పరిధిలో ‘కల్యాణ్ గ్యాంగ్’ అనే అల్లరిమూక ఓ సామాన్య పాదచారుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు.

వరంగల్‌ ఏప్రిల్ 11 (మహాప్రభ) : వరంగల్‌ నగరంలో అల్లరిమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. వరుస ఘటనలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా లేబర్ కాలనీ పరిధిలో ‘కల్యాణ్ గ్యాంగ్’ అనే అల్లరిమూక ఓ సామాన్య పాదచారుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. లేబర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని కల్యాణ్ గ్యాంగ్‌కు చెందిన సభ్యులు తమ బైక్‌తో ఢీకొట్టారు.

బండరాయితో దాడి..

ప్రమాదవశాత్తు జరిగిందేమోనని అనుకునే లోపే, ఆ గ్యాంగ్ సభ్యులు సదరు వ్యక్తిని బలవంతంగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. అక్కడ వారు దారుణంగా ప్రవర్తించారు. బాధితుడిపై బండరాయితో దాడి చేశారు. తీవ్రంగా కొడుతూ బాధితుడిని చిత్రహింసలకు గురిచేశారు. అల్లరిమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆయన ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై వరంగల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శాంతిభద్రతలపై ఆందోళన 

వరంగల్ నగరంలో గత కొన్ని రోజులుగా అరాచక శక్తులు బరితెగిస్తున్నాయి. ఇటీవల మిల్స్‌ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ ఏకంగా ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌పైనే దాడికి తెగబడ్డారు. పోలీసులపైనే దాడులు జరుగుతుంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కిరాతక దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి బ్యాచ్‌లు, అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో వరుసగా జరుగుతున్న ఈ దాడులు పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారాయి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే రోడ్లపైకి రావడానికే భయపడాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.