mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 6:24 am Digital Edition : Namastey Mahaaprabha

లివర్‌ను కాపాడుకోవాలంటే ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి

కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ కాలేయ సమస్యలు ఉన్నవారు తినే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 2 (మహాప్రభ) : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం (లివర్) ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించే ప్రధాన అవయవం. కానీ మద్యం ఎక్కువగా తాగడం, ఊబకాయం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి కారణాల వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఇది తీవ్రస్థాయికి వెళ్తే సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

కాలేయ సమస్యలు ఉన్నవారు తినే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగించి సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి. మరి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

అధిక ఉప్పు ఉన్న ఆహారాలు:

ఉప్పులో ఉన్న సోడియం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది. దీనివల్ల కాళ్లు, కడుపులో వాపు రావచ్చు. చిప్స్, ఊరగాయలు, ఇన్‌స్టంట్ ఫుడ్స్, రెస్టారెంట్ భోజనాలు తగ్గించడం మంచిది.

మద్యం:

కాలేయ సమస్యలున్నవారికి మద్యం పూర్తిగా హానికరం. ఇది కాలేయ కణాలను మరింత దెబ్బతీస్తుంది. కాబట్టి ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

వేయించిన ఆహారాలు:

సమోసా, వడ, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.

సరిగ్గా ఉడకని ఆహారాలు:

పచ్చి చేపలు, సగం ఉడికిన గుడ్లు, శుభ్రం చేయని కూరగాయలు తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆహారాన్ని బాగా ఉడికించి తినాలి.

ఎర్ర మాంసం:

గొర్రె, పంది మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి కాలేయంపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి.

తీపి పానీయాలు:

సోడాలు, స్వీట్స్, మైదా పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి కాలేయాన్ని దెబ్బతీస్తాయి.

అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు:

పాలు, వెన్న, నెయ్యి, జున్ను వంటి వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి కాలేయ పనితీరును దెబ్బతీస్తాయి. వీటి బదులుగా తక్కువ కొవ్వు ఉన్న వాటిని తీసుకోవడం మంచిది. కాలేయ సమస్యలతో బాధపడేవారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సరైన ఆహారం, వ్యాయామం, వైద్యుల సలహాలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.