mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 11:52 am Digital Edition : MAHAA PRABHA DAILY

లిఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెట్టేలోపే.. ప్రాణాపాయం తప్పిందిగా..

ఓ వ్యక్తి లిఫ్ట్‌ నుంచి బయటకు వస్తుండగా.. అకస్మాత్తుగా అది పైకి కదలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు వైరల్‌ కాగా.. లిఫ్ట్‌ల భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 4 మహాప్రభ : ఓ వ్యక్తి క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. లిఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెట్టాడో లేదో.. అంతలోనే అది అకస్మాత్తుగా పైకి వెళ్లిపోవడంతో ఆ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే…వల్సాద్‌లోని ఓ భవనంలో 9వ అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేందుకు లిఫ్ట్‌ను ఉపయోగించాడు. ఈ క్రమంలో లిఫ్ట్ ఎక్కి అతను దిగాల్సిన ఫ్లోర్ రాగానే తలుపులు తెరచుకున్నాయి. ఇంతలో అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దిగబోయాడు. అయితే క్షణకాలంలో ఆ లిఫ్ట్ పైకి వెళ్లిపోయింది. సడెన్‌గా లిఫ్ట్ పైకి పోవడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ వెంటనే జారుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అప్రమత్తమైన అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆ లిఫ్ట్‌ను నిలిపివేశారు. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ఘటనంతా లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లిఫ్ట్‌ల భద్రతపై నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందువల్లే లిఫ్ట్‌లను నిరంతరం తనిఖీలు చేస్తుండాలని, తప్పనిసరిగా సాంకేతిక ప్రమాణాలను అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనతో భవనాల్లో భద్రతా ప్రమాణాలపై చర్చ జోరందుకుంది.