mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 7:42 am Digital Edition : Namastey Mahaaprabha

రోమి బిందర్ ఫోన్ వినియోగించడానికి అదే కారణం!

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజర్‌ రోమి బిందర్‌ డగౌట్లో మొబైల్‌ వినియోగించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజాగా ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది.

స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 13 (మహాప్రభ) : ఐపీఎల్ (IPL) 2026లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజర్‌ రోమి బిందర్‌ డగౌట్లో మొబైల్‌ వినియోగించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. రోమి బిందర్ తన ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగానే ఫోన్‌ వినియోగించినట్లు తెలుస్తోంది.

ఓ స్పోర్ట్ నివేదిక ప్రకారం… బిందర్‌ గతంలో తీవ్ర ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో దాదాపు ఓ వారం రోజులపాటు బిందర్ వెంటిలేటర్ ద్వారా చికిత్స తీసుకున్నాడు. అతడు కోలుకోవడానికి దాదాపు నెల రోజులు పట్టిందని సమాచారం. అలానే ఆస్తమా కారణంగా అతడు గతంలో దాదాపు 10 కిలోల వరకు బరువు తగ్గాడు. అనారోగ్యం కారణంగా ఎక్కువ దూరం నడవడానికి, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటాడు. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా బిందర్ మాత్రం టీమ్‌కు తన సేవలను అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచుల సమయంలో తరచూ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో అతడు డగౌట్‌లో ఫోన్‌ వినియోగించి ఉంటాడని కొన్ని నివేదికలు వెల్లడించాయి.

అతడు డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకోవడానికి కనీసం 50 అడుగులు నడిచి, ఆపై సుమారు 20 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. బహుశా వైద్యులను సంప్రదించేందుకు అతడు డగౌట్‌లో ఫోన్ వినియోగించి ఉంటాడని నివేదికలు తెలిపాయి. అతనికి బీసీసీఐ నియమ నిబంధనలు తెలుసు, కానీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఫోన్ అతని వద్ద ఉందని మరో నివేదిక వెల్లడించింది. బిందర్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వాస్తవానికి నిబంధనల ప్రకారం టీమ్‌ మేనేజర్లు డగౌట్లో ఫోన్‌ వినియోగించకూడదు. మొత్తంగా రోమి బిందర్‌ వ్యవహారం నేపథ్యంలో బీసీసీఐ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై క్రికెట్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.