mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 5:07 am Digital Edition : Namastey Mahaaprabha

రూ.2,200 కోట్ల విలువైన సర్కారు భూమిని రక్షించిన హైడ్రా : Mahaaprabha

హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్‌.. దాని సమీపంలో ప్రభుత్వ భూమి.. ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమణలు.. ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో మెకానిక్‌ షెడ్లు.. గ్యారేజీలు, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చారు.

  • హైటెక్స్‌ సమీపంలో కబ్జా చెరలో 11 ఎకరాలు
  • కోర్టు స్టే ఉన్నా తాత్కాలిక నిర్మాణాలు
  • అద్దెకు దుకాణాలు, మెకానిక్‌ షెడ్లు
  • నెలకు రూ.2 కోట్ల ఆదాయం
  • హైడ్రాకు ప్రజావాణిలో స్థానికుల ఫిర్యాదు
  • నిర్ధారించి ఆక్రమణలు తొలగించిన హైడ్రా
  • స్థలం చుట్టూ ఫెన్సింగ్‌.. పరిశీలించిన కమిషనర్‌ రంగనాథ్‌

హైదరాబాద్ ఫిబ్రవరి 13,మహాప్రభ : హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్‌.. దాని సమీపంలో ప్రభుత్వ భూమి.. ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమణలు.. ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో మెకానిక్‌ షెడ్లు.. గ్యారేజీలు, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చారు. ఒకటి కాదు రెండు కాదు 30కి పైగా తాత్కాలిక దుకాణాలు, వందల సంఖ్యలో తాత్కాలిక షెడ్ల ద్వారా రూ.2 కోట్ల వరకూ అద్దె రూపంలో గడిస్తున్నారు కబ్జాదారులు. ఈ భూమి విలువ దాదాపు రూ.2,200 కోట్లు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి(Serilingampally) మండలం ఖానామెట్‌లోని 55వ సర్వేనంబర్‌ పరిధిలో ఉందీ 11 ఎకరాల ప్రభుత్వ భూమి.దాని పక్కనే 53వ సర్వే నంబర్‌ పరిధిలో మొండికుంట ఉంది. ఇవి కబ్జాకు గురయ్యాయని ప్రజావాణిలో హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా 11 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించింది. మొండికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఆలయం సరిహద్దుగా చూపి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్లు నిర్ధారించిన అధికారులు.. ఆక్రమిత స్థలలో మెకానిక్‌ షెడ్లు, స్టీల్‌ షాపులు, ఇతర దుకాణాల్లో వ్యాపారాలు సాగుతున్నాయని తేల్చారు.గత నెల 31న నిర్వహించిన విచారణకు కబ్జాదారులు కూడా హాజరయ్యారు. ఎన్‌ఆర్‌ఎస్సీ శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా భూ ఆక్రమణలు జరిగాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై కోర్టు స్టే ఉండగానే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశాల మేరకు గురువారం ఆక్రమణలు తొలగించారు. 55వ సర్వే నంబర్‌లోని 11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా అధికారులు.. మొండికుంట చెరువును ఆనుకుని ఉన్న అర్థనారీశ్వర ఆలయాన్ని మినహాయించి దాని చుట్టూ ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్‌ వేశారు.

ఆలయ పూజరులు, అద్దెకుంటున్న వారు కూల్చివేతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాదాపూర్‌ ఖానామెట్‌ పరిధిలో అధికారులు స్వాధీనం చేసుకున్న 11 ఎకరాల భూమిని గురువారం సాయంత్రం హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ స్థలంలో పార్కు ఏర్పాటు చేసి, మెండికుంట చెరువును అభివృద్ధి చేయాలని రంగనాథ్‌ను స్థానికులు కోరారు.

నోటీసులివ్వలేదు.. సామాన్యుల పరిస్థితేంటి..?

‘‘మాకు నోటీసు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుని ఉన్నాం. నాకే ప్రభుత్వం కొంత సమయం ఇవ్వకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?’’

– ఆలయ చైర్మన్‌ మహిపాల్‌ యాదవ్‌