mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 5:47 am Digital Edition : MAHAA PRABHA DAILY

యూఎస్ ఎఫ్-18 ఫైటర్ జెట్‌ను కూల్చేశాం: ఇరాన్

అమెరికాకు చెందిన ఒక ఎఫ్-18 యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. యూఎస్ మాత్రం ఈ ప్రకటనను ఖండించింది

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 26 (మహాప్రభ) : పశ్చిమాసియా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరమైన వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన ఎఫ్-18 ఫైటర్ జెట్‌ను (F-18 Fighter Jet) కూల్చేశామని పేర్కొంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్‌లో విమానం కూల్చివేత వీడియో‌ ఒకటి ప్రసారమైంది. విమానాన్ని మిసైల్ మెరుపువేగంతో ఢీకొట్టినట్టు వీడియోలో కనిపించింది. దాడి తరువాత విమానం అదుపు తప్పిపోయింది. పైలట్ వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇక ఇరాన్ ప్రకటనను అమెరికా ఖండించింది. తమ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా స్పందించింది. అత్యాధునిక గగనతల వ్యవస్థల ద్వారా ఇరాన్ తమ ఫైటర్ జెట్‌ను కూల్చిందన్న ప్రకటనలో వాస్తవం లేదని తేల్చిచెప్పింది.

అమెరికా ఫైటర్‌‌ జెట్‌పై దాడిచేశామని ఇరాన్ గతంలో కూడా ప్రకటించింది. యూఎస్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్‌పై మిసైల్‌తో దాడి చేశామని పేర్కొంది. ఇరాన్ గగనతలంలో దెబ్బతిన్న ఎఫ్-35 ఫైటర్ జెట్ అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. అయితే, శత్రు దేశం దాడి వల్లే విమానం దెబ్బతిందా? అన్న విషయాన్ని మాత్రం యూఎస్ వెల్లడించలేదు.ఇరాన్ ప్రకటనలపై యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇప్పటికే 8 వేల ఫైటర్ జెట్ మిషన్లను నిర్వహించామని ఇటీవల తెలిపింది. ఇరాన్ ఒక్కసారి కూడా తమ విమానాలను కూల్చలేదని తేల్చి చెప్పింది. అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్న ఇరాన్‌ను కట్టడి చేసేందుకు యూఎస్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట గగనతల దాడులకు దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దాడులకు యూఎస్ విరామం ప్రకటించింది. ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది. అయితే, అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరపట్లేదని ఇరాన్ తేల్చి చెప్పింది.