mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 5:48 am Digital Edition : Namastey Mahaaprabha

మేడారం జాతరను యునెస్కో పరిధిలోకి తేవాలి

మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజారతను ఇంటాంజియబుల్‌ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించేట్టు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ కృషిచేయాని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క కోరారు.

వరంగల్ ఫిబ్రవరి 21 మహాప్రభ : మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజారతను ఇంటాంజియబుల్‌ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించేట్టు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ కృషిచేయాని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క కోరారు. కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ గిరిజన దేవతలు పేరుతో ముద్రించిన పుస్తకాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని జ్యోతిరావుపూలే భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి దనసరి సీతక్క ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించేలా ట్రస్ట్‌ శ్రమించినట్టే ఈ మేడారం జాతర విషయంలో కూడా తగిన ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. మేడారం జాతర ఆసియాలోకెల్లా అతిపెద్ద గిరిజన జాతర అని, ఈ జాతర అనేక ప్రత్యేకతలతో కూడుకున్నదని అన్నారు. యునెస్కో పరిధిలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఈ జాతరకు ఉన్నాయన్నారు. వందల సంవత్సరాలుగా గిరిజన సంప్రదాయంతో జరుగుతున్న మేడారం జాతర ఎప్పటికీ చెక్కుచెదరని అపురూపమైన వారసత్వ సంపదగా అభివర్ణించారు. మేడారం జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించడంలో విశేషంగా కృషి చేస్తున్న కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క అభినందించారు.

ఈ సందర్భంగా ప్రముఖ చలన చిత్ర దర్శకుడు బి.నర్సింగరావు మేడారం జాతరకు సంబంధించిన అత్యంత అరుదైన ఛాయాచిత్రాలతో, సమగ్ర సమాచారాన్ని జోడించి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ సభ్యులు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య, బీవీ పాపారావు, నిట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పాండు రంగారావు, కె.శ్రీధర్‌, రిటైర్డ్‌ డీజీపీ ఎం.రతన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.