mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 11:46 am Digital Edition : MAHAA PRABHA DAILY

మెట్రో స్వాధీన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో స్వాధీన తీర్మానం ప్రవేశపెట్టారు. మెట్రో స్వాధీన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్, మార్చి 28 (మహాప్రభ) : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ మెట్రో రైలును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి దాదాపు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 31 నుంచి మెట్రో రైలును నడిపించేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో స్వాధీన తీర్మానం ప్రవేశపెట్టారు. మెట్రో స్వాధీన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. విస్తరణ కోసమే మెట్రో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

తీర్మానాలు ఏకపక్షంగా ఆమోదించడం సరికాదు: హరీష్‌రావు

అసెంబ్లీలో తీర్మానాలను ఏకపక్షంగా ఆమోదించడం సరికాదని ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. మెట్రో తీర్మానంపై సభలో చర్చించలేదని అన్నారు. మెట్రో తీర్మాన ఆమోదం ఏకగ్రీవం కాదు.. ఏకపక్షం అంటూ మండిపడ్డారు. ఖనిజాలపై ఏటా ఆదాయం పెరుగుతోందని తెలిపారు. మైనింగ్‌ శాఖలో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణకు వచ్చే ప్రతి రూపాయిని కాపాడుకోవాలని కోరారు.

ప్రభుత్వానికి ఎల్‌అండ్‌టీ విజ్ఞప్తి..

నష్టాలతో సతమతమవుతున్నామని, మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకొంటామని నాలుగైదేళ్లుగా ఎల్‌అండ్‌టీ సంస్థ చెబుతోంది. ఇదే విషయాన్ని గత సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఎల్‌అండ్‌టీ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణంతో పాటు సంస్థ ఈక్విటీ వాటా రూ.2 వేల కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైలును టేకోవర్‌ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకుండానే ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహించనుంది.