నిజామాబాద్ కార్పొరేషన్‌ని తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో శనివారం సమావేశం అవుతానని.. ఈ భేటీలో కార్పొరేషన్‌ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14 మహాప్రభ : నిజామాబాద్ కార్పొరేషన్ తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఈరోజు (శనివారం) సమావేశం అవుతానని.. ఈ భేటీలో కార్పొరేషన్‌ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ వేదికగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్ కూడా తమ ఖాతాలోకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీపీఐ నేతలతో మాట్లాడుతున్నామని అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జగిత్యాలలో కాంగ్రెస్ వాళ్లే చైర్మన్‌గా ఉంటారని స్పష్టం చేశారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుస్తాం..
మున్సిపల్ ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయిందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో 90 శాతం గెలవాలని రూల్ ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు. కవితకి ఈ ఎన్నికలు ఉత్సాహాన్ని ఇచ్చి ఉండవచ్చని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని చెప్పుకొచ్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలని గెలుస్తామని జోస్యం చెప్పారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.