mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:15 am Digital Edition : MAHAA PRABHA DAILY

మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య

వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది.

  • పెళ్లి విషయంలో ప్రేమజంట వాగ్వాదం
  • ఈ రోజే చేసుకుందామని అతడు.. పరీక్షల తర్వాత అని ఆమె..
  • మనస్తాపంతో ఉరి వేసుకొని ప్రియుడి ఆత్మహత్య

కురవి(మహబుబాబాద్) మార్చి 11 మహాప్రభ : వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో మంగళవారం చోటు చేసుకొం ది. కురవి ఎస్సై గండ్రాతి సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కురవికి చెందిన వల్లపునేని శశికుమార్‌ (21) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇతను, కేసముద్రం శివారు తండాలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యువతి (20) సంవత్సర కాలం నుంచి ప్రేమించుకున్నారు. ఆమె ప్రస్తుతం మహబూబాబాద్‌లో ఇంటర్‌ చదువుతోంది. కాలేజ్‌కు వచ్చివెళ్లే క్రమంలో మానుకోట బస్టాండ్‌లో శశికుమార్‌తో జరిగిన పరిచయం ప్రేమగా మారింది.

మంగళవారం మధ్యాహ్నం శశికుమార్‌.. యువతికి ఫోన్‌ చేశాడు. ఇద్దరం ఈ రోజే పెళ్లి చేసుకుందామని పట్టుబట్టాడు. అయితే ఇంటర్‌ పరీక్షలు జరు గుతున్నాయని, అవి పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని యువతి సర్దిచెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రియురాలు తన మాట వినకపోవడంతో క్షణికావేశానికి గురైన శశికుమార్‌ కురవిలోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. చుట్టుపక్కల వారు వచ్చి ఉరితాడు తొలగించి చూడగా, అప్పటికే శశికుమార్‌ చనిపోయాడు. శశికుమార్‌ తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా, తల్లి కవిత, అన్న సాయి, తమ్ముడు సంతోష్‌ ఉన్నారు. ఎస్సై సతీష్‌ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.