mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 7:07 am Digital Edition : Namastey Mahaaprabha

భారత్‌ విషయంలో వెనక్కు తగ్గిన కెనడా!

తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ భారత్‌పై ఆరోపణలు చేసిన కెనడా ప్రస్తుతం తన పంథాను మార్చుకుంది. ప్రధాని కార్నీ భారత పర్యటన నేపథ్యంలో అక్కడి అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్ , ఫిబ్రవరి 26 మహాప్రభ : తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ భారత్‌పై గతంలో ఆరోపణలు గుప్పించిన కెనడా ప్రభుత్వం తాజాగా వెనక్కు తగ్గింది. భారత పర్యటన నేపథ్యంలో ప్రధాని కార్నీ కాస్త మెత్తపడ్డారు. భారత్‌కు కెనడా ప్రధాని బయలుదేరడానికి ముందు అక్కడి అధికార వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి. భారత్ జోక్యం చేసుకుంటోందని తాము విశ్వసించి ఉంటే కెనడా ప్రధాని భారత పర్యటనకు వెళ్లే వారు కాదని తెలిపాయి.‘ఈ విషయాలపై భారత్‌తో ఇప్పటికే చర్చించాం. ఇతరుల జోక్యాన్ని అడ్డుకునేందుకు మా వద్ద పటిష్ట వ్యవస్థలు ఉన్నాయి. ఈ అంశాల గురించి నిత్యం ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఈ దిశగా చర్చలు నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి’ అని అధికారి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. తమ దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, భారత్ విషయంలో తమ వైఖరి పూర్తిగా మారిందా? అనే విషయంలో మాత్రం అక్కడి అధికార వర్గాలు స్పష్టత ఇవ్వలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

గతేడాది కెనడా నిఘా సేవల సంస్థ సీఎస్ఐఎస్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెనడాలో గూఢచర్యం వెనుక భారత ఏజెంట్లు ఉన్నారని ఆరోపించింది. కెనడా పౌరుడు, ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టు ఆరోపించింది. అయితే, భారత్ ఈ ఆరోపణలను అప్పట్లో నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంతేకాకుండా, భారత్‌లో ఉంటున్న పలువురు కెనడా దౌత్యవేత్తలనూ స్వదేశానికి తిరిగెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి.కార్నీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు కార్నీ భారత పర్యటనకు రానున్నారు. దౌత్య, వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకునే దిశగా భారత్‌లో పర్యటిస్తారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అగ్రరాజ్యంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కెనడా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌లలోనూ కెనడా ప్రధాని పర్యటించనున్నారు.