mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:13 am Digital Edition : Namastey Mahaaprabha

బెంగాల్ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు: పీవీఎన్ మాధవ్

ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ‘రౌడీ పరిపాలన’కు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

విజయవాడ మే 5 ( మహాప్రభ ) : మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో విజయవాడలో ఆ పార్టీ నేతలు విజయోత్సవర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో భవానీపురంలోని సుజనా చౌదరి కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ‘రౌడీ పరిపాలన’కు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

బీజేపీ వ్యవస్థాపకులు డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన గడ్డపై ఒకప్పుడు జనసంఘ్ కేవలం ఒక్క సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించిందని మాధవ్ గుర్తుచేశారు. అక్కడ బీజేపీ సాధించిన విజయం చరిత్రాత్మకమని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడటం దేశాభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాం, పాండిచ్చేరిలో అద్భుత విజయాలను సాధించామని మాధవ్ చెప్పారు. బీజేపీకి మైనారిటీలు ఓటు వేయరనే అపోహను తొలగిస్తూ, 60 శాతం ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో 63 స్థానాలకు గాను 40 స్థానాలు గెల్చుకోవడం విశేషమని పేర్కొన్నారు. తమిళనాడులో సూపర్ స్టార్ విజయ్ సాధించిన విజయాన్ని బీజేపీ స్వాగతించిందని తెలిపారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ విజయం సాధ్యమైందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. విజయోత్సవ ర్యాలీలో పెద్దఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.