mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 11:41 am Digital Edition : MAHAA PRABHA DAILY

బెంగళూరులో సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య

భర్త గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి కొన్ని నిమిషాలకే అతడి భార్య అపార్ట్‌మెంట్‌‌లోని 17వ అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

బెంగళూరు, మార్చి 31 (మహాప్రభ) : భర్త గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి కొన్ని నిమిషాలకే అతడి భార్య అపార్ట్‌మెంట్‌‌లోని 17వ అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కె.భానుచందర్ రెడ్డి(32), బీబీ షాజియా సిరాజ్(31) వివాహం చేసుకుని బెంగళూరులో నివసిస్తున్నారు. బీబీ షాజియా సిరాజ్ కూడా ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. సోమవారం భర్త భానుచందర్ రెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆ తర్వాత భార్య అరిచినా అతడు తలుపు తెరవలేదు. దీంతో అపార్ట్‌మెంట్‌లోని ఇరుగుపొరుగు వారితోపాటు సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి గది తలుపులను బద్దలు కొట్టించిందామె.గదిలో భర్త భానుచందర్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించాడు. ఆ వెంటనే బీబీ షాజియా కూడా తాము ఉంటున్న అదే అపార్ట్‌మెంట్ 17వ అంతస్తుపై నుంచి కిందకి దూకింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. భానుచందర్ రెడ్డి దంపతుల గురించి స్థానికులను అడిగి ఆరా తీస్తున్నారు. వారి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అధిక ఒత్తిడి, అనారోగ్యం, మానసిక సమస్యలు తదితర కారణాలేమైనా అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

పోస్ట్‌మార్టం నివేదిక వస్తే తప్ప ఈ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని పోలీసులు వివరించారు. మరోవైపు మృతుల తల్లిదండ్రులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. వీరి మృతితో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.