mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:22 am Digital Edition : Namastey Mahaaprabha

బియ్యం..కయ్యం.. రేషన్‌ డీలర్లు వర్సెస్‌ సీఎస్‌ డీటీలు

గుంటూరు నగరంలో ఈ నెల ప్రారంభం నుంచి రేషన్‌ డీలర్లు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు(సీఎస్‌ డీటీలు) మధ్యన వార్‌ నడుస్తోంది. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల పేరుతో డీటీలు కొన్ని రేషన్‌ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు.

గుంటూరు మే 5 ( మహాప్రభ ) : గుంటూరు నగరంలో ఈ నెల ప్రారంభం నుంచి రేషన్‌ డీలర్లు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు(సీఎస్‌ డీటీలు) మధ్యన వార్‌ నడుస్తోంది. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల పేరుతో డీటీలు కొన్ని రేషన్‌ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. స్టాకు హెచ్చు తగ్గుల నేప థ్యంలో.. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసి, షాపు సీజ్‌ చేస్తున్నారు. దీనిని డీలర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. స్టాకు సక్రమం గానే ఉన్నా.. డీటీలే ఆటోలో బియ్యం బస్తాలు తీసుకొచ్చి అన్‌ లోడింగ్‌ చేసి.. స్టాకు అదనంగా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గళం విప్పుతున్నారు.

ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో పరస్పర ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మే నెల రేషన్‌ పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. కొంతమంది డీలర్లు నేరుగా కార్డుదారులకు కేజీ బియ్యానికి రూ.14 నుంచి రూ. 15 వరకు చెల్లించి ఆ స్టాకుని రేషన్‌ మాఫియాకి చేర్చి లబ్ధి పొందుతున్నారు. కొంతమంది డీలర్లు.. పలుకుబడితో రేషన్‌ షాపు మంజూరు చేయించుకుని ఇతర డీలర్లకు సబ్‌ లీజుకు ఇచ్చేశారు.

డీలర్లు, సీఎస్‌ డీటీలు మధ్య ఒప్పందం కుదిరితే ఎలాంటి సమస్య తలెత్తడం లేదు. ఎప్పుడైతే ఇరువర్గాల మధ్యన భేదాలు తలెత్తుతాయో అప్పుడు పరస్పర చర్యలకు ఉపక్రమిస్తున్నారు. జిల్లాలో 972 షాపులు ఉంటే యాక్టివ్‌లో 928 మాత్రమే ఉన్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకొంటే 34 షాపులను అధికారలు సీజ్‌ చేసినట్లు స్పష్టమవుతోంది.