mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 6:50 am Digital Edition : Namastey Mahaaprabha

ఫిబ్రవరి నుంచే వేడి! : Mahaaprabha

దాదాపు రెండునెలల పాటు ప్రజలను వణికించిన చలి.. ఫిబ్రవరి నెలలో తగ్గనున్నది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి.

  • దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
  • రాయలసీమ, దక్షిణ కోస్తాలో సాధారణంగానే రాత్రి ఉష్ణోగ్రతల

విశాఖపట్నం, ఫిబ్రవరి 4 మహాప్రభ  : దాదాపు రెండునెలల పాటు ప్రజలను వణికించిన చలి.. ఫిబ్రవరి నెలలో తగ్గనున్నది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. అయితే తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయి. ఇదే సమయంలో వాయవ్యభారతంలో చలిగాలులు నమోదయ్యే రోజుల సంఖ్య తగ్గనుంది. మధ్యభారతంలో, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా, దేశంలో మిగిలిన ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఫిబ్రవరిలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు, వర్షపాతంపై భారత వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెలలో సగటు కంటే తక్కువగా వర్షపాతం నమోదుకానుంది. వర్షాలపై ఆధారపడి పంటలు సాగుచేసే వాయవ్య, దానికి ఆనుకొని మధ్య, తూర్పుభారతంలో ఎక్కువరోజులు పొడివాతావరణం కొనసాగుతుంది. దీర్ఘకాల సగటు వర్షపాతం లెక్కల మేరకు వాయవ్య భారతంలో ఈనెలలో 65 మి.మీ.లు, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 22.7 మి.మీ.ల వర్షపాతం నమోదుకావాలి. అయితే దీర్ఘకాల సగటులో 81 శాతం వర్షపాతం కురిసే అవకాశం ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఈ నెలంతా వేడి…

రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో వేసవి తీవ్రత ఛాయలు కనిపించే అవకాశం ఉందని తాజా బులెటిన్‌ బట్టి అంచనా వేయవచ్చని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. ఈ నెలలో రాయలసీమ, దక్షిణ కోస్తాలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా, ఉత్తరకోస్తాలో సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం రాయలసీమ,కోస్తాలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయ అంచనావేస్తున్నారు.

సీమలో తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు

కోస్తా జిల్లాలపైకి తూర్పుగాలులు వీస్తుండడంతో అనేకచోట్ల స్వల్పంగా మేఘాలు ఆవరించాయి. రాయలసీమలో ఆకాశం నిర్మలంగా మారింది. దీంతో రాత్రి పూట చలి తీవ్రత కొనసాగింది. విశాఖ ఏజెన్సీ కంటే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. సోమవారం కడపలో 15.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.