mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 7:18 am Digital Edition : MAHAA PRABHA DAILY

ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. కారణం ఏంటో చెప్పిన నిందితుడు..

ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్‌వాల్ తుపాకితో పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అప్రమత్తం అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది.

న్యూఢిల్లీ, మార్చి 12 మహాప్రభ : జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై బుధవారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. జమ్మూ గ్రేటర్‌ కైలాశ్‌ ప్రాంతంలోని హోటల్‌ రాయల్‌ పార్క్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయనపై 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్‌వాల్ తుపాకితో పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అప్రమత్తం అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. ఫరూఖ్ అబ్దుల్లా ప్రాణాలతో బయటపడ్డారు. కాల్పులకు యత్నించిన కమల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు దాడికి ఉపయోగించిన లైసెన్స్ ఉన్న తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో అతడు పలు సంచలన విషయాలు చెప్పాడు. ‘20 ఏళ్ల నుంచి అబ్దుల్లాను చంపటానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఈ రోజు అతడిని చంపే అవకాశం దొరికింది. కానీ, అతడు చావ లేదు. ప్రాణాలతో బయటపడ్డాడు. వ్యక్తిగత కారణాలతోటే అతడిని చంపాలనుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రత్యక్ష సాక్షి రాకేష్ సింగ్ నిందితుడు కమల్ సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘కమల్ సింగ్ గుర్తు తెలియని పలు సంఘాలకు నాయకుడిగా ఉన్నాడు. స్థానికంగా అతడికి మూడు షాపులు ఉన్నాయి. వాటినుంచి వచ్చే అద్దె ద్వారా అతడు జీవనం సాగిస్తున్నాడు’ అని చెప్పాడు.

దేవుడి దయ వల్లే..

ఫరూఖ్ అబ్దుల్లాపై జరిగిన హత్యాయత్నంపై ఆయన కుమారుడు, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ మేరకు బుధవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘దేవుడు దయామయుడు. మా నాన్న తృటిలో తప్పించుకున్నారు. ఆ వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకిని పెట్టి కాల్పులు జరిపాడు. సిబ్బంది కారణంగా అతడి ప్రయత్నం విఫలం అయింది. ఓ వ్యక్తి జెడ్‌ప్లస్ సెక్యూరిటీని దాటుకుని మాజీ ముఖ్యమంత్రి దగ్గరకు ఎలా వచ్చాడు?’ అని రాసుకొచ్చారు.