mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 12:37 pm Digital Edition : Namastey Mahaaprabha

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అయితే.. ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభావం ధరలపై ఎలా ఉండనుందనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే…

ఇంటర్నెట్ డెస్క్ మే 11 ( మహాప్రభ ) : భారతీయులకు బంగారం మీద ఎప్పటినుంచో మక్కువ ఉందనేది రహస్యమేమీ కాదు. పసిడి వినియోగదారులలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో ఒకటిగా ఉంది భారత్. అయితే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావాల నుంచి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పసిడి కొనుగోళ్లను ఏడాదిపాటు తగ్గించాలని తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో పాటు అనవరసమైన విదేశీ ప్రయాణాలు తగ్గించాలనీ సూచించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగంలోనూ జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం, దిగుమతుల భారాన్ని తగ్గించడం కోసం ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మోదీ.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో భారత్ ఒకటి. దేశీయ అవసరాల్లో దాదాపు 90 శాతం వరకు బంగారం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల వరకు పసిడిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో ఈ వ్యయం మరింత పెరిగింది. 2025-26 ఆర్థిక ఏడాదిలో బంగారం దిగుమతుల విలువ రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. ఇదే సమయంలో చమురు దిగుమతుల భారం కూడా పెరగడంతో దేశ వాణిజ్య లోటు మరింత విస్తరించింది.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం దిగుమతులు పెరగడం రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది. విదేశీ మారక నిల్వలూ తగ్గే ప్రమాదం ఉంది. ఇటీవల ఫారెక్స్ నిల్వలు గణనీయంగా తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. దేశ అవసరాల్లో సుమారు 80-85 శాతం చమురు దిగుమతుల ద్వారానే రావడమే ఇందుకు ప్రధాన కారణం.

ఇక.. ప్రధాని మోదీ వ్యాఖ్యల ప్రభావం నేటి స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. అయితే నిపుణులు దీర్ఘకాలంలో పసిడికి డిమాండ్ తగ్గదని చెబుతున్నారు. భారతీయులలో బంగారానికి పెట్టుబడి, పొదుపు, సంప్రదాయం పరంగా ప్రత్యేక స్థానం ఉందని విశ్లేషిస్తున్నారు. తాత్కాలికంగా కొనుగోళ్లు మందగించినా.. భవిష్యత్తులో మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.