mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 12:19 pm Digital Edition : Namastey Mahaaprabha

పూజారులతో తాళికట్టించుకున్న హిజ్రాలు

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని కువాగం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన కూత్తాండవర్‌ ఆలయంలో 18 రోజుల పాటు కొనసాగనున్న చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

  • ఆటపాటలతో సందడి  

చెన్నై ఏప్రిల్ 29 (మహాప్రభ) : తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని కువాగం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన కూత్తాండవర్‌ ఆలయంలో 18 రోజుల పాటు కొనసాగనున్న చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 14న మారియమ్మన్‌ ఆలయం నుండి ఉత్సవమూర్తి కూత్తాండవర్‌ను మేళతాళాలతో ఆలయానికి తరలించిన పూజారులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 15వ తేదీ మహాభారతంపై ఉపన్యాసం, 16న శాంతను చరిత్రపై బుర్రకథ, 17న భీష్ముడి జనన విశేషాలపై నాటకం, 18న ధర్మరాజు పుట్టుక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారు కళ్లు తెరిచే కార్యక్రమం, హిజ్రాలు ఆలయ పూజారులచే తాళి కట్టించుకునే వేడుకలు మంగళవారం సాయంత్రం జరిగాయి. ఇందుకోసం ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 1.5లక్షల మందికి పైగా హిజ్రాలు ఆలయానికి తరలిరావడంతో కువాగం గ్రామంలో సందడి నెలకొంది. వేకువజామునే స్నానమాచరించి పట్టుచీర, రవికలు ధరించి మెడలో బంగారు ఆభరణాలు, తల్లోపూలు పెట్టుకున్న హిజ్రాలు నవవధువుల్లా అలంకరించుకున్నారు.

ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో వరుస క్రమంలో నిల్చుని పూజారులతో తాళి కట్టించుకున్నారు. రాత్రి 8గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఆటపాటలు, నృత్యాలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. బుధవారం ఉదయం రథోత్సవం సందర్భంగా అరవాన్‌ విగ్రహానికి తిరిగి రంగులు వేసి పులిహోరను నైవేద్యంగా నివేదించి గ్రామమంతటా ఊరేగిస్తారు. రథం శోకస్థలాన్ని చేరుకున్న అనంతరం పూజారులు హిజ్రాలకు కట్టిన తాళులను తీసేసి, వారి గాజులను పగులగొడతారు.

ఆ ప్రాంతంలో తెల్లచీరలు ధరించి వితంతువులుగా మారిన హిజ్రాలు.. అరవాన్‌ మరణానికి దుఃఖంతో విలపిస్తారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని బావులు, చెరువుల్లో స్నానాలు చేసి హిజ్రాలు తమ సొంతూళ్లకు పయనమవుతారు. లక్షమందికి పైగా హిజ్రాలు తరలిరావడంతో కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీ అరవింద్‌ రమేష్‌ నేతృత్వంలో 700 మందికి పైగా పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. 30వ తేదీ వీడ్కోలు, మే 1వ తేదీ ధర్మరాజు పట్టాభిషేకంతో 18రోజుల చిత్తిరై ఉత్సవాలు సమాప్తమవుతాయి.