mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 5:59 am Digital Edition : Namastey Mahaaprabha

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది.

  • లారీ ఢీకొని విద్యార్థి మృతి

చేర్యాల(సిద్దిపేట) ఏప్రిల్ 3 (మహాప్రభ) : వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన కడుదూరి కీర్తన(18) ఇంటర్‌ పూర్తి చేసింది. రానున్న పోటీపరీక్షలకు సన్నద్ధమవుతుంది. తాత కడుదూరి బాలయ్య వృద్ధాప్యరీత్యా మాత్రలు కొనుగోలుచేయడానికి చేర్యాలకు వస్తున్న క్రమంలో మనవరాలు కీర్తన తాను పుస్తకాలు కొనుక్కుంటానని చెప్పి అతడితో కలిసి మోపెడ్‌పై చేర్యాలకు చేరుకున్నారు.

స్థానిక పాతబస్టాండు చౌరస్తా వద్ధ గల మెడికల్‌షాపునకు వెళ్తుండగా, మక్కజొన్న విత్తనలోడుతో అత్యంత వేగంతో దూసుకువచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో కిందపడిపోయిన కీర్తనపై నుంచి దూసుకె ళ్లడంతో కాలువిరగడంతో తీవ్రగాయాలయ్యాయి. లారీ ముందు భాగంలో మోపెడ్‌ ఇరుక్కోగా బాలయ్యను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు లారీని అడ్డుకుని బాలయ్యను క్షేమంగా బయటకు లాగారు. ఈవిషయమై 108ఆంబులెన్స్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఆంబులెన్స్‌ సిబ్బంది చేరుకుని చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.

అప్పటికే కీర్తన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఉన్నత చికిత్స నిమిత్తం హైదరాబాదు యశోద ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. బాలయ్య స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదకారకుడు కోదాటి సాంబశివరావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు సీఐ రమేశ్‌ తెలిపారు. ఎస్సై అపూర్వరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామసభలో సర్పంచ్‌ కొమ్ము రవి, వార్డుసభ్యులు తదితరులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు