mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 6:54 am Digital Edition : MAHAA PRABHA DAILY

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు.. పవన్ ప్రకటన

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎండల‌ తీవ్రత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అమరావతి, మార్చి 10 మహాప్రభ : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మార్పులు చేపట్టినట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగాలనుకున్న రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎండల‌ తీవ్రత వల్ల పిఠాపురం ఆవిర్భావ సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా, నగరం, మండల కేంద్రం, పంచాయతీల్లో ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.మార్చి 14 జనసైనికులకు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు పండగలాంటి రోజని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అన్నారు. పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని జనసైనికులు, వీర మహిళలు, నాయకులు, ఉద్యమ సభ్యత్వం పొందినవారి సమక్షంలో ఎగురవేయాలని సూచించారు. పార్టీ సైద్ధాంతిక బలం, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఏ విధంగా ముందుకు వెళ్తుందో పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరించాలన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని జనసేన అధినేత పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ సూచించారు.

ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మార్చినట్లు జనసేన అధినేత తెలిపారు. ఈ దఫా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయిలో పిఠాపురంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించామని.. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయనే రిపోర్టులను పరిగణనలోకి తీసుకుని.. అందుకు అనుగుణంగా వేడుకల నిర్వహణ స్వరూపాన్ని మార్చామని వివరించారు. ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా కాకుండా జిల్లా, సిటీ, మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని కొనసాగించేలా ఎక్కడికక్కడ స్థానికంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.