mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 12:33 pm Digital Edition : Namastey Mahaaprabha

పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..

గతేడాది భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దాలేనని తేలింది. తాజాగా బయటకు వచ్చిన అమెరికా లాబీయింగ్ రికార్డులు ఈ వాదనలు తప్పని నిరూపించాయి.

గతేడాది భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దాలేనని తేలింది. భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తాము ధైర్యంగా నిలబడ్డామని, కాల్పుల విరమణ కోసం భారత్ ఒత్తిడి తెచ్చిందని ఆదివారం రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్‌లో ఆసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు. అయితే తాజాగా బయటకు వచ్చిన అమెరికా లాబీయింగ్ రికార్డులు ఈ వాదనలు తప్పని నిరూపించాయి (Pakistan ceasefire claim).

అమెరికా ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద నమోదైన పత్రాల ప్రకారం, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్, వాషింగ్టన్‌లో భారీ స్థాయిలో లాబీయింగ్ నిర్వహించింది. అమెరికా కాంగ్రెస్ సభ్యులు, భద్రతా నిపుణులు, రాజకీయ వర్గాలతో పాక్ లాబీ సంస్థలు వరుసగా సంప్రదింపులు జరిపినట్లు బయటపడింది. కాల్పుల విరమణ కోసం గతేడాది మే 6,7,8,9 తేదీల్లో పాక్ భారీ స్థాయిలో లాబీయింగ్ చేసింది. అమెరికాలోని రక్షణ అధికారులతో, ఆ దేశ మీడియాలోని ప్రముఖ వ్యక్తులతో 20 నుంచి 25 సార్లు పాక్ లాబీ సంస్థలు భేటీ అయ్యాయి (US lobbying records).

భారత్ మరిన్ని దాడులు చేయవచ్చనే ఆందోళనను వ్యక్తం చేసిన పాకిస్థాన్.. అమెరికా మధ్యవర్తిత్వం అవసరమని ప్రాధేయపడినట్టు రికార్డులు చెబుతున్నాయి (Operation Sindoor news). అయితే తాజాగా ఆసిమ్ మునీర్ మాత్రం.. పాకిస్థాన్ సైన్యం వ్యూహాత్మకంగా పైచేయి సాధించిందని, భారతదేశమే చర్చలకు రావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాజాగా లాబీయింగ్ డేటా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.