mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 12:20 pm Digital Edition : Namastey Mahaaprabha

పాక్‌లో ఇంధన కొరత.. లాక్‌డౌన్ తరహా ఆంక్షలు

పాక్‌లో ఇంధన కొరత తీవ్రమైన నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలకు తెరతీసింది. రాత్రి 8 గంటల తరువాత షాపులు, మాల్స్, ఇతర వాణిజ్యసముదాయాలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాక్ ప్రధాని తాజాగా ఈ విషయాలను వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 7 (మహాప్రభ) : హోర్ముజ్ జలసంధి మీదుగా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచాన్ని ఇంధన సంక్షోభం భయపెడుతోంది. ఇంధన కొరత ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలకు తెరతీసింది. వాణిజ్య కార్యకలాపాలపై పరిమితులను ప్రకటించింది. విద్యుత్, ఇంధన పొదుపు చర్యలపై సమావేశం నిర్వహించిన అనంతరం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఆంక్షలను ప్రకటించారు.

రేడియో పాకిస్థాన్‌ ప్రసారం చేసిన వివరాల ప్రకారం, ఇకపై దేశవ్యాప్తంగా పాక్‌లో మార్కెట్స్, షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలను రాత్రి 8 గంటల కల్లా మూసివేయాల్సి ఉంటుంది. అయితే, డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌కు మాత్రం ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ఆయా ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకూ కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించింది. ఇక బేకరీలు, ఫుడ్ స్టాల్స్ వంటివి కూడా రాత్రి 10 గంటల కల్లా మూసేయాల్సి ఉంటుంది. ప్రజల ఇళ్లల్లో రాత్రి 10 గంటల తరువాత పెళ్లిళ్లకు సంబంధించి కార్యక్రమాలు ఏవీ నిర్వహించకూడదు. అయితే, ఫార్మసీలు, ఇతర హెల్త్ కేర్ సర్వీసెస్‌కు సంబంధించిన షాపులకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపును ఇచ్చింది. ఈ ఆంక్షలు తక్షణం అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.