మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్‌ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాల ఏప్రిల్ 8 (మహాప్రభ) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో (Mancherial Hospital) వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన (Expired) ఇంజక్షన్‌ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన పూజిత – శ్రవణ్ కుమార్ దంపతులకు ఒక బాబు జన్మించాడు. బాబుకు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు (Lungs Problems) తలెత్తడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు.
అసలేం జరిగిందంటే?..
బాబుకు చికిత్స అందిస్తున్న క్రమంలో, వైద్య సిబ్బంది ఓ ఇంజక్షన్ వేశారు. అయితే ఆ ఇంజక్షన్‌ను పరిశీలించిన కుటుంబ సభ్యులు, దాని ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయిందని గుర్తించారు. అంతేకాకుండా, బాటిల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌ను మార్ఫింగ్ చేసి ఉండటం చూసి వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ బిడ్డ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాబు తండ్రి, కుటుంబ సభ్యులు వైద్యుడిని, సిబ్బందిని నిలదీశారు. అయితే, తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, ఆస్పత్రి సిబ్బంది బాధితులతో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు..
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం, అనుచిత ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పసికందు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఇలాంటి బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్న పిల్లల వైద్యం విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.