mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 6:16 am Digital Edition : Namastey Mahaaprabha

పరమేశ్వరుడికి పాగాలంకరణ

ముక్కంటీశుని దర్శనానికి భక్తకోటి కదలిరాగ ఇల కైలాసం శ్రీశైలం పులకించింది.

  • వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం
  • భక్తజన సంద్రంగా శ్రీశైల క్షేత్రం
  • లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

శ్రీశైలం, ఫిబ్రవరి 16మహాప్రభ : ముక్కంటీశుని దర్శనానికి భక్తకోటి కదలిరాగ ఇల కైలాసం శ్రీశైలం పులకించింది. లయకారుడైన పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన శివరాత్రివేళ శ్రీశైల మహా క్షేత్రం భక్తజనసంద్రమైంది. ఆదివారం మల్లన్న ప్రభోత్సవం, పాగాలంకరణ ఘట్టం, ఆదిదంపతుల బ్రహ్మోత్సవ లీలా కళ్యాణ వేడుకలను చూసి భక్తులు పులకించిపోయారు. రాత్రి నందివాహనంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆలయోత్సవం నిర్వహించారు. నంది వాహనంపై కొలువైన ఆది దంపతులను భక్తులు దర్శించి తరించారు.రాత్రి పది గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను 11మంది వేదపండితులు నిర్వహించారు. అదే సమయంలో ఆలయ ప్రధాన గోపురంపై ఉండే కలశానికి పాగాలంకరణ ప్రారంభిం చారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురానికి చెందిన పృథ్వీ సుబ్బారావు గర్భాలయ విమాన శిఖరం నుండి నవనందులను అనుసం ధానం చేస్తూ పాగను అలంకరిం చారు. పాగాలంకరణ జరుగుతు న్నంత సేపు ఆలయ ప్రాంగణం, క్షేత్ర ప్రధాన వీధులు శివనామస్మరణతో మార్మోగింది. పాగాలంకరణతో మల్ల న్న పెళ్లికుమారుడు కాగా అర్ధ రాత్రి 12 గంటల సమయంలో స్వామి, అమ్మ వార్ల కళ్యాణోత్సవం కన్నులపండుగగా సాగిం ది. దేవదేవుని కళ్యాణ వేడుకను చూసిన భక్తులు పరవశించిపోయారు. కార్యక్రమాల్లో డీఐజీ కోయ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఆది దంపతుల ప్రభోత్సవం…

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శివరాత్రి పర్వదినం సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ఘనంగా ప్రభోత్సవం నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య ఆలయ ప్రధాన వీధిలోని గంగాధర మండపం వద్దకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో తీసుకువచ్చి పుష్పాలంకృతమైన ప్రభపై ఆశీనులజేసి విశేష పూసలు చేశారు. ఆలయ ఛైర్మెన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు నారికేళాలు సమర్పించి ప్రభోత్సవాన్ని ప్రారంభించారు. కళ్యాణానంతరం స్వామి, అమ్మవార్లకు రథోత్సవం నిర్వహించే ముందు చండీశ్వరస్వామి క్షేత్ర వీధులను పరిశీలించేందుకు ప్రభోత్సనాన్ని నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు భక్తులకు వివరించారు.

నేడు రథోత్సవం.. తెప్పోత్సవం

బ్రహ్మోత్సవాలలో తొమ్మిదో రోజైన సోమవారం సాయంత్రం ప్రధాన మాడవీధిలో రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు అధికారులు తెలిపారు.