mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 11:48 am Digital Edition : Namastey Mahaaprabha

పక్కింటి వ్యక్తిపై ఊహించని రివెంజ్.. దెయ్యాల కథలను వినిపిస్తూ..

చైనాలో తాజాగా వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దెయ్యాల కథలను వినిపిస్తూ పక్కింటి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నారు. చివరకు స్థానిక న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 4 (మహాప్రభ) : చైనాలో తాజాగా వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు తమ పక్కింట్లోని వ్యక్తిపై ఊహించని విధంగా ప్రతీకారం తీర్చుకున్నారు. దాదాపుగా రోజంతా దెయ్యాల కథలు వినిపిస్తూ చుక్కలు చూపించారు. పక్కింటి వ్యక్తి గోడకు పక్కనే స్పీకర్లు పెట్టి ఈ కథనలను వినిపించారు. సౌండ్ మాత్రం పరిమితికి లోబడే ఉండటంతో తొలుత పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. చివరకు సమస్యను పరిష్కరించేందుకు ఏకంగా కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని గ్వాంజూ నగరంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, నగరంలో లూ, అతడి రూమ్‌మేట్ లీ ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే జీ ఉంటున్నారు. రెండు ఇళ్లకు మధ్య కామన్‌గా ఒకే గోడ ఉంది. ఇటీవల లూ, అతడి రూమ్‌మేట్‌‌కు జీకి మధ్య ఏదో కారణంగా వివాదం తలెత్తింది. చివరకు జీపై ప్రతీకారం తీర్చుకునేందుకు లూ, లీలు సిద్ధమయ్యారు. తమ ఇళ్ల మధ్య ఉన్న గోడ పక్కన స్పీకర్లు పెట్టి దెయ్యాల కథనలను వినిపించడం ప్రారంభించారు. ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకూ, ఆపై మధ్యాహ్నం 3.00 గంటల నుంచీ రాత్రి 10.00 గంటల వరకూ నిరంతరంగా దెయ్యాల కథలను వినిపించేవారు.

అయితే, లూ ఇంటి పైన రెండవ అంతస్తులో మరో వ్యక్తి ఉంటున్నారు. ఈ శబ్దాలు అక్కడి వరకూ వెళ్లడంతో ఆయనకూ ఇబ్బందులు మొదలయ్యాయి. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆయన కుమారుడు కూడా ఈ శబ్దాలతో ఇబ్బంది పడ్డారు. వారు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. లూ ప్లే చేస్తున్న శబ్దాల తీవ్రత చట్టబద్ధ పరిమితులకు లోబడే ఉండటంతో పోలీసులు జోక్యం చేసుకోలేకపోయారు.

చివరకు ఈ ఉదంతం కోర్టు ముందుకు వచ్చింది. లూ కావాలనే ఇలా చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. వెంటనే స్పీకర్లను తొలగించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అధికారుల సమక్షంలో లూ వాటిని తొలగించారు. మరోసారి ఇలా చేయనని కూడా లూ మాటివ్వడంతో వివాదానికి తెరపడింది.