mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 6:19 am Digital Edition : Namastey Mahaaprabha

నేడు ఇంగ్లండ్‌తో మ్యాచ్.. పాక్‌ను భయపెడుతున్న వాన!

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 పోరు రసవత్తరంగా మారుతోంది. సెమీఫైనల్ బెర్తులే లక్ష్యంగా అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.

స్పోర్ట్స్ డెస్క్,ఫిబ్రవరి 24 మహాప్రభ : టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) సూపర్-8 పోరు రసవత్తరంగా మారుతోంది. సెమీఫైనల్ బెర్తులే లక్ష్యంగా అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే శ్రీలంకపై గెలిచిన ఉత్సాహంతో ఇంగ్లండ్.. ఇప్పుడు పాకిస్థాన్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు అభిమానులను వాన భయం వెంటాడుతోంది.సూపర్-8లో భాగంగా పల్లెకెలె వేదికగా ఫిబ్రవరి 22న జరిగిన న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ వర్షార్పణమైన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇవాళ ఇంగ్లండ్‌(England)తో జరిగే మ్యాచ్ కూడా వరణుడి ఖాతాలోకి వెళ్తే మాత్రం పాకిస్థాన్‌కు భారీ నష్టం జరుగుతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధిస్తే.. పాకిస్థాన్ ఇంటి బాట పరిస్థితి తలెత్తే అవకాశముంది. ఒకవేళ పాక్ గెలిస్తే.. సెమీస్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అడ్డుపడితే మాత్రం.. పాక్ అటు సెమీస్‌కు వెళ్లక, ఇంటిదారి పట్టక మధ్యలో ఉంటుంది. అప్పుడు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంకతో జరిగే చివరి మ్యాచ్‌లో పాక్ గెలిచినా… ఆ జట్టు సెమీస్‌కు చేరాలంటే ఇతర జట్ల విజయాలు.. నెట్ రన్‌రేట్‌ కీలకం కానుంది.

పల్లెకెలె వెదర్ రిపోర్ట్ ఇదే..

స్థానిక వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. పల్లెకెలె(Pallekele) నగరంలో పగటిపూట 25 శాతం వానపడే అవకాశం ఉంది. 48 శాతం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మ్యాచ్ జరిగే వేళ అనగా రాత్రి 7:00 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది. కేవలం 2 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశముందంది. మొత్తంగా ఇంగ్లండ్, పాకిస్థాన్ మ్యాచ్‌పై వరణుడి ఎఫెక్ట్ ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు వాతావరణం పొడిగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.