mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 7:46 am Digital Edition : Namastey Mahaaprabha

నెతన్యాహు ఫోన్ కాల్స్‌తో చర్చలు విఫలం? మీడియా కథనంలో సంచలనం

యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్ తరువాత చర్చల్లో పీటముడి పడిందంటూ ఇరాన్ వార్త సంస్థ ప్రచురించిన కథనం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 13 (మహాప్రభ)  : పాక్‌లో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. దీంతో, పశ్చిమాసియాలో ఉద్రికత్తలు మళ్లీ చెలరేగాయి. డీల్ కుదరకపోవడానికి అవతలి వారే కారణమంటూ యూఎస్‌, ఇరాన్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ పరిణామాల వెనుక ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు కూడా ఉన్నారని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాగ్జీ ఆరోపించినట్టు వార్తలు రావడం సంచలనం కలిగిస్తోంది.

ఇరానీయన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ ఈ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ పాత్రపై మంత్రి అరాగ్చీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారని చెప్పుకొచ్చింది. చర్చల సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్‌కు ఫోన్ చేసినట్టు మంత్రి అరాగ్చీ చెప్పారని ప్రెస్ టీవీ పేర్కొంది. దీంతో, చర్చలు ఇజ్రాయెల్ ప్రయోజనాలవైపు మళ్లాయని అరాగ్చీ చెప్పినట్టు పేర్కొంది. యుద్ధంతో సాధించలేనిది చర్చల ద్వారా సాధిద్దామని యూఎస్ భావించినట్టు ఆయన అన్నారు. అయితే, ఈ పోస్టు అరాగ్జీ టైమ్‌లైన్‌లో కనిపించకపోవడంతో అసలు తెరవెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక డీల్ కుదరకపోవడంపై మంత్రి అరాగ్చీ తాజాగా ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 47 ఏళ్ల తరువాత యూఎస్‌తో జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో ఇరాన్ చిత్తశుద్ధితో పాల్గొందని చెప్పారు. డీల్ అంగుళాల దూరంలో ఉండగా యూఎస్ అసాధారణ డిమాండ్‌ తేవడం, చర్చల లక్ష్యాన్ని పలుమార్లు మార్చడం వంటివి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అసలు గుణపాఠాలు ఏమీ నేర్చుకోలేదని కూడా విచారం వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరవడం, అణు కార్యక్రమాన్ని వదులుకునేందుకు ఇరాన్ ఇష్టపడకపోవడంతోనే డీల్‌ కుదరలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.