mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 8:57 am Digital Edition : MAHAA PRABHA DAILY

నా కుమారుడు మహేష్‌ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్‌ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్‌

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఎంపీ మహేష్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని, టీడీపీ హై కమాండ్‌కి వివరణ ఇచ్చామని చెప్పారు.

కడప జిల్లా, మార్చి 23 మహాప్రభ : తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు వివాదంపై కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ (MLA Putta Sudhakar Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు(సోమవారం) కడప జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడారు. తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంపై క్లారిటీ ఇచ్చారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై సుధాకర్ యాదవ్ స్పందించారు. తన కుమారుడు నిరపరాధి అని పేర్కొన్నారు.

డ్రగ్స్ కేసుపై పుట్టా సుధాకర్ యాదవ్ వివరణ

‘నా కుమారుడు నిరపరాధి’ అని తెలిపారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు.

పార్టీకి వెళ్లిన మాట వాస్తవమే, కానీ..

మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి ఎంపీ మహేశ్‌కుమార్ యాదవ్ వెళ్లిన మాట నిజమేనని పుట్టా సుధాకర్ యాదవ్ అంగీకరించారు. అయితే, తన కుమారుడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, ముఖ్యంగా డ్రగ్స్ తీసుకునే అలవాటు అస్సలు లేదని స్పష్టం చేశారు.

వైద్య పరీక్షలపై అభ్యంతరం

మహేశ్ వద్ద నుంచి కనీసం బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండానే రిపోర్టులో పాజిటివ్ అని ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ధారణా ప్రక్రియపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

పార్టీ అధిష్టానానికి నివేదిక

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను తెలుగుదేశం పార్టీ (TDP) అధిష్ఠానానికి సమర్పించినట్లు వెల్లడించారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, ఇన్వెస్టిగేషన్ ముగిశాక అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

అన్ని వివరాలతో మీడియా ముందుకొస్తాం

పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత, మహేశ్ నిరపరాధి అని నిరూపించే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని ఆయన పేర్కొన్నారు.