నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను నిలువునా ముంచేశాడు ఓ విత్తన వ్యాపారి. వినుకొండ ప్రాంతంలో ‘అజిత’ పేరుతో విక్రయించిన కొత్త రకం వరి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.
పల్నాడు జిల్లా మే 8 ( మహాప్రభ ) : వినుకొండ నియోజకవర్గంలో నకిలీ విత్తనాల విక్రయం కలకలం సృష్టించింది. ఈపూరు మండలం అగ్నిగుండాల రైతులను ఓ విత్తన వ్యాపారి నిలువునా ముంచేశాడు. వినుకొండ ప్రాంతంలో ‘అజిత’ పేరుతో విక్రయించిన కొత్త రకం వరి విత్తనాలతో రైతులు మోసపోయారు. సుమారు 100 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే ఆశించిన దిగుబడి రాకపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. తక్కువ దిగుబడి వచ్చిందని రైతులు అయోమయానికి గురయ్యారు.
విత్తనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేసిన రైతులు వ్యాపారిని ప్రశ్నించగా.. తనకు ఏ సంబంధం లేదంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు అన్నదాతలు ఆరోపించారు. తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశాడని ఆరోపిస్తూ రైతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ జరిపి, నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారిపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.