mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 12:12 pm Digital Edition : Namastey Mahaaprabha

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన జనసేన..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డుని ఆ పార్టీ కైవసం చేసుకుంది. 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు.

నల్గొండ, ఫిబ్రవరి 13 మహాప్రభ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డును ఆ పార్టీ కైవసం చేసుకుంది. 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు. తెలంగాణలో జనసేన విజయ ప్రస్థానానికి విజయలక్ష్మి తొలి అడుగు వేశారంటూ ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జనసేన విజయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారాయన. ఘన విజయం సాధించిన విజయలక్ష్మికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.

రామ్ తాళ్లూరి ట్వీట్ ఇదే..

‘జనసేన పార్టీ తరఫున తొలిసారిగా.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాం. తొలి కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. జాతీయ మహిళా దినోత్సవం రోజున వారికి ఎంతో ప్రాధాన్యమిచ్చే మా పార్టీ తరఫున మహిళ ద్వారా తొలి విజయాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. జనసేన అధినేత స్ఫూర్తితో ఆయన ఇచ్చిన ధైర్యంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ ఒక్కరికీ, అలాగే పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్న ప్రతీ నేతకూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.ఈ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా సరే.. మరింత ఉత్సాహంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని కోరుతున్నా. ఈ నెల రోజులు నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి, పార్టీ శ్రేణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా. రానున్న రోజుల్లో మరింత బలంగా తెలంగాణలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిస్తున్నా’ అని రామ్ తాళ్లూరి ట్వీట్ చేశారు. మరోవైపు మంచిర్యాల కార్పొరేషన్ 34వ డివిజన్ జనసేన అభ్యర్థి సాగర్ సైతం గెలుపు సొంతం చేసుకున్నారు.