mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 11:51 am Digital Edition : Namastey Mahaaprabha

తమిళనాడు ఎస్ఐఆర్ తుది జాబితా విడుదల.. 74 లక్షల మంది ఓటర్ల తొలగింపు

తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తికావడంతో తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారంనాడు విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది.

చెన్నై ,ఫిబ్రవరి 23 మహాప్రభ : తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తికావడంతో తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారంనాడు విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్ల బాజితాలో చోటుచేసుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు 6.41 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. సోమవారంనాడు చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు చీఫ్ ఎలక్షన్ అధికారి అర్చనా పట్నాయక్ ఈ జాబితాను విడుదల చేశారు.తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 2025 డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 30 వరకూ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాల్సిందిగా 4.38 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 4.23 లక్షల ఎంట్రీలను వెరిఫికేషన్ అనంతరం తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించామని పేర్కొంది.కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ వేసవి సీజన్‌లోనే జరగనున్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలు కూదా ఇదే పీరియడ్‌లో జరగాల్సి ఉన్నాయి.