mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 7:14 am Digital Edition : Namastey Mahaaprabha

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్‌ నివాళులర్పించారు.

చెన్నై,ఫిబ్రవరి 25 మహాప్రభ : తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జయలలిత, చివరి వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించి ఆమె జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేశారని, రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి పీహెచ్‌డీ వరకు ఉచితంగా అందజేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత లబ్ధిపొందారన్నారు. అదే విధంగా మహిళలకు ఆమె అందించిన పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. 2001లో అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్షోభ స్థితిలో ఉన్న సమయంలో అమ్మ తనను ముఖ్యమంత్రిగా నియమించారని, ఆరు నెలలు ఆమె బాటలోనే పదవిలో కొనసాగినట్లు తెలిపారు.

ఆ తర్వాత ఆండిపట్టి నియోజకవర్గంలో ఆమె పోటీచేయడంతో తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. 2011లో మళ్లీ పార్టీ సంక్షోభ స్థితిలో కూడా తానే ముఖ్యమంత్రి అయ్యానని వివరించారు. తాను పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లు కారణం చూపి పార్టీ నుంచి తొలగించారని అన్నారు. తాను ఏం తప్పు చేశానో ఇప్పటివరకు నిరూపించలేదని, ఒకవేళ తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓపీఎస్‌ ప్రకటించారు.