విశాఖపట్నం నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు..
ఇంటర్నెట్ డెస్క్ మార్చి 28 (మహాప్రభ) : విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం (6E 579) సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI)లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం గాలిలో ఉండగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శబ్ధాలు వచ్చాయి. వెంటనే పైలట్లు అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. స్పందించిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు.. ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.ఇండిగో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 10:59 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని 161 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక తనిఖీల తర్వాత.. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు తరలించారు. ప్రస్తుతం ఇంజన్ వైఫల్యానికి గల కారణాలపై విమానయాన నియంత్రణ సంస్థ (DGCA), ఇండిగో సాంకేతిక బృందం విచారణ చేస్తున్నాయి.