mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 12:26 pm Digital Edition : Namastey Mahaaprabha

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న ఆకాశ ఎయిర్ – స్పైస్‌జెట్ విమానాలు

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రన్‌వేపై ట్యాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ ఎయిర్ – స్పైస్‌జెట్ కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

న్యూఢిల్లీ ఏప్రిల్ 16 (మహాప్రభ) : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ (గురువారం) ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రన్‌వేపై ట్యాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ ఎయిర్ (Akasa Air) – స్పైస్‌జెట్ (SpiceJet)కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘటన విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో స్పైస్‌జెట్ విమానం కుడి వైపు వింగ్లెట్ (Winglet) దెబ్బతినగా, పార్క్ చేసి ఉన్న ఆకాశ ఎయిర్ విమానం యొక్క వెనుక భాగం (Horizontal Stabilizer) దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులకు కానీ, విమాన సిబ్బందికి కానీ ఎటువంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రంగా స్పందించింది. రన్‌వేపై విమానాల కదలికల విషయంలో ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది లేదా పైలట్ల పొరపాటు ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదం కారణంగా రెండు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులను మరో విమానంలో పంపించేందుకు ఆయా ఎయిర్‌లైన్స్ ఏర్పాట్లు చేశాయి. ఈ హఠాత్‌పరిణామంతో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. రన్‌వేపై ఇలా విమానాలు ఢీకొనడం భద్రతా పరంగా పెద్ద లోపంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.