mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 11:47 am Digital Edition : MAHAA PRABHA DAILY

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

పైపులతో నేచురల్ గ్యాస్‌కు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, ఇంధనం ధరల్లో మార్పు లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారంనాడు ప్రకటించింది.

న్యూఢిల్లీ మార్చి 25 ( మహాప్రభ ) : పైపులతో నేచురల్ గ్యాస్ (PNG)కు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, పెట్రోల్, డీజిల్‌కు దేశంలో ఎలాంటి కొరత లేదని, ఇంధనం ధరల్లో మార్పు లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారంనాడు ప్రకటించింది. వదంతులు నమ్మవద్దని కోరింది. గృహావసరాల కోసం వందశాతం పీఎన్‌జీ సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ తెలిపారు. ఈ మేరకు నోటీఫికేషన్ ఇచ్చామని, నిర్దిష్ట కాలపరిమితి లోపు దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్ గ్యాస్ మౌలిక వసతుల అభివృద్ధి జరగనుందని చెప్పారు.పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఎల్పీజీ, ఇంధనం కొరతపై ఆందోళనలను ప్రస్తావిస్తూ, ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, ప్యానిక్ బైయింగ్‌కు పాల్పడవద్దని కోరారు. రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ఏటా 26 కోట్ల టన్నుల రిఫైనరీ సామర్థ్యం మనకు ఉందని చెప్పారు. గత రెండు రోజులుగా రిటైల్ ఔట్‌లెట్‌లు, పెట్రోల్ బంకుల వద్ద పెద్దఎత్తున జనం క్యూలు కడుతుండటం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఆందోళన అవసరం లేదని, దేశంలో తగినన్ని పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. పెట్రోల్, డిజిల్ ధరలు కూడా పెరగబోవడం లేదని వివరించారు.

వలస కార్మికులకు 5 కిలోల సిలెండర్లు

వలస కార్మికులకు ప్రాధాన్యతా క్రమంలో 5 కిలోల సిలెండర్లు అందిస్తామని సుజాతా శర్మ తెలిపారు. 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల ఎల్పీజీ కేటాయించామన్నారు. మంగళవారంనాడు 30,000 ఐదు కేజీల సిలెండర్లు ఇచ్చామని చెప్పారు. బ్లాక్‌మార్కెటింగ్‌, అక్రమ నిల్వలకు కళ్లెం వేసేందుకు 2,700 దాడులు జరిపామని, 2,000 సిలెండర్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై వస్తున్న వార్తలు నిజం కాదనీ, గ్యాస్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవనీ సుజాత శర్మ వివరించారు. కనెక్షన్‌తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఎప్పటిలాగానే కొనసాగుతుందని సుజాత శర్మ స్పష్టం చేశారు