కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీఎంకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ డీఎంకే చేస్తున్న వాదనలను ఆయన ‘మొసలి కన్నీళ్లు’గా అభివర్ణించారు.
న్యూఢిల్లీ ఏప్రిల్ 16 (మహాప్రభ) : లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భంగా కర్ణాటకకు చెందిన బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య విపక్షాలపై, ప్రధానంగా డీఎంకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ డీఎంకే చేస్తున్న వాదనలను ఆయన ‘మొసలి కన్నీళ్లు’గా అభివర్ణించారు.
‘ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండాలన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. జనాభా ప్రాతిపదికన స్థానాల కేటాయింపు జరగడం ప్రజాస్వామ్య సూత్రం’ అని తేజస్వి సూర్య పేర్కొన్నారు. డీఎంకే వంటి పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తరాది-దక్షిణాది విభజనను సృష్టించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.
దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయనే ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో ఏ ఒక్క రాష్ట్రానికీ అన్యాయం జరగదు. మొత్తం సీట్ల సంఖ్య పెరగడం వల్ల అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం మెరుగుపడుతుందే తప్ప తగ్గదు’ అని ఆయన స్పష్టం చేశారు. కేవలం భయాందోళనలు సృష్టించడం ద్వారా మహిళా రిజర్వేషన్ల అమలును అడ్డుకోవాలని డీఎంకే ప్రయత్నిస్తోందని విమర్శించారు.
పునర్విభజన అనేది జనాభా గణాంకాల ప్రకారం జరిగే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదని తేజస్వి సూర్య తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ఈ బిల్లుల ద్వారా భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో మహిళలకు సరైన గౌరవం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.