టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందకు ఆయన మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఫైనల్ మ్యాచులో 255 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆది నుంచి తడబడుతూ వచ్చింది. అయితే 11వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ వరుసగా రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అప్పటికే వైడ్లు వేస్తూ.. వికెట్ కూడా తీయకపోవడంతో అర్ష్‌దీప్ కాస్త అగ్రెషన్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అదే ఓవర్ ఐదో బంతికి నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు మిచెల్ ఆడాడు. అయితే ఫాలో త్రులో బంతిని అందుకున్న అర్ష్‌దీప్ కోపంతో వికెట్ల వైపు త్రో విసిరాడు. ఆ బంతి నేరుగా వెళ్లి మిచెల్‌కు బలంగా తాకింది. క్రీజులో ఉన్నప్పటికీ తనపైకి బంతి విసరడంతో మిచెల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అర్ష్‌దీప్ వైపు కోపంగా చూస్తూ..గట్టిగా అరుస్తూ అతడి వైపు వెళ్లాడు. అయినా అర్ష్‌దీప్ తొలుత క్షమాపణ చెప్పకుండా వెనక్కి నడవడంతో మిచెల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వెంటనే సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మిచెల్‌కు సర్దిచెప్పాడు. అంపైర్ కూడా అర్ష్‌దీప్‌ను పిలిచి హెచ్చరించాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ స్వయంగా మిచెల్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. మ్యాచ్ అనంతరం కూడా మిచెల్, అర్ష్‌దీప్ కలిసి మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.