mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 12:01 pm Digital Edition : Namastey Mahaaprabha

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారాయన. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అమెరికన్ ప్రజల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడనుంది.

ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 20 మహాప్రభ : అమెరికాలో ఏలియన్స్, యూఎఫ్ఓ(అన్ఐడెంటిఫైయింగ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్)లకు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Trump) ఆదేశించారు. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులకు(UFO) సంబంధించిన రహస్య ఫైళ్లను గుర్తించి.. వాటిని బహిర్గతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో గ్రహాంతర వాసుల ఉనికిపై దశాబ్ద కాలంగా సాగుతున్న అమెరికన్ల ఉత్కంఠకు తెరపడనుంది. ప్రజల్లో ఈ రహస్యాల పట్ల ఉన్న ఆసక్తిని తీర్చాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన ట్రూత్ సోషల్(Truth Social) వేదికగా పేర్కొన్నారు ట్రంప్.యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా(Barack Obama).. గ్రహాంతరవాసులు ఉన్నారని(Aliens are real) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై ఒబామా నాడు మాట్లాడుతూ.. ‘గ్రహాంతర వాసులు ఉన్నది నిజమే కావచ్చు. కానీ నేనెప్పుడూ వారిని చూడలేదు’ అని అన్నారు. అమెరికాలోని ఏరియా 51లో వారిని దాచిపెట్టారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తన పదవీ కాలంలో ఏలియన్స్ భూమిపై సంచరించినట్టు ఎలాంటి ఆధారాలూ లభించలేదని స్పష్టం చేశారు. అయితే.. ఈ సమాచారాన్ని ఒబామా బహిర్గతం చేయడాన్ని తప్పుబట్టారు ట్రంప్. క్లాసిఫైడ్ సమాచారాన్ని బయటపెట్టి ఒబామా పెద్ద తప్పుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒబామా వైరల్ అయిన ‘ఏరియా 51’ వ్యాఖ్యలను ట్రంప్ ఉదహరిస్తూ.. ‘ఏలియన్స్‌లో ఎవరున్నారో నిజంగా నాకు తెలియదు. కానీ ప్రభుత్వం వద్దనున్న సమాచారాన్ని మాత్రం బయటపెడతాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే.. గ్రహాంతర సాంకేతికతకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని 2024 మార్చిలో పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం.. వాటికి సంబంధించిన సమాచారమేమీ లేదని.. ఆకాశంలో కనిపించిన వింత వస్తువులు సహజమైనవి కావచ్చని స్పష్టం చేసింది. కానీ దీనిపై ఇప్పుడు ట్రంప్ సెక్రటరీ ఆఫ్ వార్ సహా ఇతర ఏజెన్సీ సంస్థలను రంగంలోకి దింపి ఈ రహస్య ప్రక్రియను ఛేదించేందుకు యత్నించడం చర్చనీయాంశమైంది.అయితే.. ఈ రహస్య పత్రాలను ప్రజల ముందుకు తీసుకువస్తారా లేదా అనే విషయమై ఎలాంటి స్పష్టతనివ్వలేదు ట్రంప్. ఈ ఫైళ్లలో అత్యంత సంక్లిష్టమైన, ఆసక్తికరమైన, ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం ఏది ఉన్నా బహిర్గతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏది ఏమైనా ట్రంప్ తాజా నిర్ణయంతో.. అంతరిక్షంలో ఉన్న ఇతర జీవుల ఉనికిపై అమెరికా ప్రభుత్వ అధికారిక వైఖరి ఏమిటనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్నో ఖగోళ విషయాలు బయటకు వస్తాయని, చాలా మందికి అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం లభించనుందని శాస్త్రవేత్తల్లో ఆసక్తి నెలకొంది.