టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్‌పై విజయంతో ఇంగ్లండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్‌లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
స్పోర్ట్స్ డెస్క్,ఫిబ్రవరి 25 మహాప్రభ : నిన్న(బుధవారం) పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ చేయడంతో రెండు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచ కప్ 2026లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ పొట్టి ప్రపంచ కప్‌లో సెమీఫైనల్స్‌కు చేరడంతో ఇంగ్లండ్ ఓ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ ఐసీసీ టోర్నీలో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.ఇంగ్లండ్ జట్టు గతంలో వరుసగా 2016, 2021, 2022, 2024, 2026 ఎడిషన్లలో సెమీఫైనల్స్‌కు చేరింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉండేది. పాక్ వరుసగా 2007, 2009, 2010, 2012 ఎడిషన్లలో సెమీస్‌కు చేరగా… శ్రీలంక వరుసగా 2009, 2010, 2012, 2014 ఎడిషన్లలో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. 2010, 2022 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా సూపర్-8 పోరులో శ్రీలంక, పాకిస్థాన్‌పై విజయాలతో ఇంగ్లండ్ జట్టు గ్రూప్-2 నుంచి దర్జాగా సెమీస్‌కు చేరింది. చివరి సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్‌లలో వరుసగా అత్యధిక సెమీఫైనల్స్ సాధించిన జట్లు:
- ఇంగ్లండ్ – 5 (2016, 2021, 2022, 2024, 2026)
- పాకిస్థాన్ – 4 (2007, 2009, 2010, 2012)
- శ్రీలంక – 4 (2009, 2010, 2012, 2014)