mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 5:52 am Digital Edition : Namastey Mahaaprabha

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట.. : Mahaaprabha

టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి తప్పుకుని చాలా పెద్ద తప్పు చేశామని భావనలో బంగ్లాదేశ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ రిలీఫ్ లభించింది.

స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి 10, మహాప్రభ : టీ20 ప్రపంచకప్‌(Worl Cup-2026) నుంచి తప్పుకుని చాలా పెద్ద తప్పు చేశామని భావనలో బంగ్లాదేశ్ ఉన్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. అలానే ఐసీసీ కూడా వారిపై చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీబీకి భారీ ఊరట లభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ ఆడమని పాకిస్థాన్(Pakistan) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సమావేశం జరగ్గా.. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది. ఇదే మీటింగ్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు పాల్గొనకపోవడంపై ఐసీసీ(ICC) నిరాశ వ్యక్తం చేసింది. ఇదే సమయంలో బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడా పరమైన, పరిపాలనా జరిమానా విధించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని తెలిపింది. దీని వల్ల వారి హక్కులకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని ఐసీసీ వెల్లడించింది.అలానే బంగ్లాదేశ్‌లో 2031 పురుషుల ప్రపంచకప్ జరగడానికి ముందు ఓ ఐసీసీ ఈవెంట్‌కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఐసీసీ తన ప్రకటనలో తెలియజేసింది. అది కూడా అండర్-19 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుందని సమాచారం. ఐసీసీ తీసుకున్న నిర్ణయాలతో టీ20 వరల్డ్ కప్-2026లో పాల్గొనని బంగ్లాదేశ్‌కు భారీ ఊరట లభించిందని క్రీడా నిపుణులు అభిప్రాయా పడుతున్నారు.