mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 11:55 am Digital Edition : Namastey Mahaaprabha

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు.

అమరావతి, ఫిబ్రవరి 18 మహాప్రభ : టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా తాము సిద్ధమని, ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు సవాల్ విసిరారు. టీటీడీ కల్తీ నెయ్యి విషయంపై చర్చకు సిద్ధమని నిన్న(మంగళవారం) సభలోనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో అనిత మాట్లాడారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ తమ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో అసలు అది నెయ్యి కాదని.. రసాయనాల మిశ్రమమని చెప్పిందని తెలిపారు. గతంలో కూడా పింక్ డైమండ్ గురించి వైసీపీ సభ్యులు సభ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు. అధికారుల విచారణలో పింక్ డైమండ్ అనేది లేదని తేలిందన్నారు. హెరిటేజ్ 34 సంవత్సరాలుగా ఉన్న సంస్థ అని.. హెరిటేజ్ నుంచి దేవాలయాలకు నెయ్యి పంపిణీ చేయకూడదనే నిబంధన పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

సభలో రాద్ధాంతం చేస్తే కుదరదు..

వైసీపీ సభ్యులు సంబంధం లేని విషయాలని సభకు తీసుకువచ్చి రాద్ధాంతం చేస్తే కుదరదని… ఆధారాలు ఉంటే రండి చర్చకు సిద్ధమని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. వైసీపీ నేతలకు దేవుడంటే లెక్క లేదని మండిపడ్డారు. టీటీడీ నెయ్యికి సంబంధించి సేకరణ లేని సంస్థకు జగన్ హయాంలో కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ నెయ్యిలో ఎలాంటి రసాయనాలు కలిపారో కూడా సభలో చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు. ఎవరితోనైనా ఆడుకోండని.. కానీ వేంకటేశ్వరస్వామితో ఆటలాడొద్దని హెచ్చరించారు. సాక్షి పేపర్‌లో రాసిన విషయాలని వైసీపీ సభ్యులు సభలో మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు..

సాక్షి పేపర్‌లో యాడ్‌ల కోసం రూ.600 కోట్ల ప్రభుత్వ ధనాన్నిదుర్వినియోగం చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. వైసీపీ నేతళ్లాగా తమకు దుర్బుద్ధి లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యులే కల్తీ లడ్డూ మీద వాయిదా తీర్మానం, ఇందాపూర్ డెయిరీ పైన వాయిదా తీర్మానం ఇచ్చారని ప్రస్తావించారు. మదనపల్లి చిన్నారి ఘటన విషయంలో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అతను చేసింది తప్పని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.