హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ టీచర్లు పరేషాన్ అవుతున్నారు. యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్‌తో సతమతమవుతున్నారు.
- ప్రైవేట్ టీచర్లకు పలు యాజమాన్యాల ఆదేశాలు
- వేసవి సెలవుల్లో ఇంటింటి ప్రచారం.. అప్పుడే వేతనాలు పెంపు
హైదరాబాద్ సిటీ ఏప్రిల్ 14 (మహాప్రభ) : జిల్లాలోని ప్రైవేట్ టీచర్లు పరేషాన్ అవుతున్నారు. యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్‌తో సతమతమవుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని నిబంధనలు విధించడమే ఇందుకు కారణం. 2025-26 అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 20 వరకు పరీక్షలను పూర్తిచేసి 24 నుంచి వచ్చే జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ 48 రోజుల సెలవు రోజులను సంతోషంగా గడపాలని ప్రైవేట్ ఉపాధ్యాయులు భావిస్తున్నారు. కానీ ఇచ్చిన పనిని పూర్తి చేయకుంటే వచ్చే ఏడాది వేతనాలు పెంచేది లేదని స్పష్టంగా చెబుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.
ఒక్కొక్కరికీ 20-30 అడ్మిషన్లు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 1,886 గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్, కార్పొరేట్, బడ్జెట్ స్కూళ్లు ఉన్నాయి. సుమారు 8.60 లక్షల మంది చదువుతున్నారు. తాజాగా అక్కడి యాజమాన్యాలు ఒక్కో టీచర్ ఈసారి 20-30 అడ్మిషన్లు కచ్చితంగా తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. అప్పుడే అదనంగా 10 శాతం ఇంక్రిమెంట్ వేస్తామని, లేకుంటే పాత జీతాలే వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్కూల్‌ను కూడా మానుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. వేసవి సెలవులను వృథా చేయొద్దని, పాఠశాలకు సంబంధించిన కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని మౌఖికంగా సూచించడంతో పరేషాన్ అవుతున్నారు.

- ప్రత్యామ్నాయం కోసం నిరీక్షణప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్‌ను పూర్తి చేయాలని కొంతమంది భావిస్తుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. 20-30 మంది వరకు కొత్త పిల్లలను తీసుకురావడం సాధ్యం కాదంటూ.. ఇతర స్కూళ్లలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అడ్మిషన్ల బాధ్యతలు లేకుంటే వేతనం తక్కువైనా సరే.. చేరాలని చూస్తున్నారు. కాగా, ఈసారి 20 అడ్మిషన్లు తీసుకురావాలని ఇటీవల పాఠశాల యాజమాన్యం చెప్పిందని సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు తెలిపారు. దీంతో చేసేదేమి లేక రెండు, మూడు రోజుల నుంచి తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లి మాట్లాడుతున్నానని చెప్పారు. 20 అడ్మిషన్లు కాకున్నా.. కనీసం 15-18 వరకైనా చేయాలని చూస్తున్నానని, ఉద్యోగం కావాలంటే ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కష్టపడాల్సి వస్తోందని తెలిపారు.